: చంద్రబాబుతో రతన్ టాటా భేటీ
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా ట్రస్ట్ అధినేత రతన్ టాటా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వీరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరిరువురూ, పలు ప్రాజెక్టులపై చర్చించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 264 గ్రామాలను టాటా ట్రస్టు తరపున అభివృద్ధి చేసే అంశంపై కూడా చర్చ జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 'సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన' పథకాన్ని ప్రారంభించినప్పుడు... టాటా ట్రస్టు తరపున గ్రామాలను దత్తత తీసుకోవాలని రతన్ టాటాను కోరారు. దీనికి సమ్మతించిన టాటా... ఆ తర్వాత దేశంలోని ఎంపీలందరికీ లేఖలు రాశారు. ఆయన లేఖలకు కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే స్పందించారు. అందులో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒకరు. లేఖ రాయడమే కాకుండా, టాటాను వ్యక్తిగతంగా కలసి, 264 గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరారు. గ్రామాల దత్తతకు సంబంధించి చంద్రబాబు, రతన్ టాటాలు ఈ సాయంత్రం ప్రకటన చేయనున్నారు.