: తల్లిదండ్రులకు ఘనంగా పెళ్లి చేశాడు!


రంగారెడ్డి జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఎప్పుడో విడిపోయిన తల్లిదండ్రులను ఒప్పించి మళ్లీ ఒక్కటి చేశాడో యువకుడు. వివరాల్లోకెళితే... శామీర్ పేట్ కు చెందిన సతీశ్వర్ రెడ్డి (55), సంగీత (50)లకు 1986లో వివాహం అయింది. వారికో అబ్బాయి పుట్టగా, శంతన్ రెడ్డి అని నామకరణం చేశారు. అయితే, విభేదాల కారణంగా 1996లో సతీశ్వర్ రెడ్డి దంపతులు విడిపోయారు. అప్పటికి శంతన్ చిన్నవాడు. అతడిని తల్లి తనతో పాటు తీసుకుని వెళ్లింది. తల్లి దగ్గరే పెరిగిన శంతన్, అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, ఆపై అక్కడే ఉద్యోగం సంపాదించుకున్నాడు. అయితే, విడిపోయిన తల్లిదండ్రులను కలపాలన్న కోరిక అతడిలో ఎప్పటి నుంచో ఉంది. దాంతో, ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తొలుత అమ్మ, నాన్న ససేమిరా అన్నారు. అయినా గానీ శంతన్ పట్టువిడవలేదు. తల్లిదండ్రులను ఒప్పించేందుకు ఎన్నో ఏళ్లు పట్టు విడవకుండా ప్రయత్నించాడు. ఎట్టకేలకు కలిసుండేందుకు వారు ఒప్పుకోవడంతో శంతన్ ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. ఇటీవలే అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన ఆ కుర్రాడు తన తల్లిదండ్రులకు పెళ్లంటూ బంధుమిత్రులందరికీ ఆహ్వానాలు పంపాడు. తొలుత వారు ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత శంతన్ ను మనసారా అభినందించారు. శామీర్ పేట్ సమీపంలోని క్షేత్రగిరి గుట్ట దైవ సన్నిధిలో తల్లిదండ్రులకు ఆదివారం ఘనంగా వివాహం జరిపించాడు. కాగా, శంతన్ ప్రయత్నం తల్లిదండ్రులు సతీశ్వర్ రెడ్డి, సంగీతలను సంతోషసాగరంలో మునకలేసేలా చేసింది. తమను ఒక్కటి చేసేందుకు బిడ్డ పడిన తాపత్రయం తమను పొంగిపోయేలా చేసిందని ఆనందం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News