: లంకపై భారత్ ఘన విజయం... సిరీస్ సమం చేసిన కోహ్లీ సేన


భారత స్పిన్నర్లు బాల్ ను మెలికలు తిప్పేశారు. లంక బ్యాట్స్ మెన్ ను బోల్తా కొట్టించారు. వెరసి రెండో టెస్టులో టీమిండియా శ్రీలంకపై 278 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో లంక బ్యాట్స్ మెన్ భారత స్పిన్ కు బెంబేలెత్తిపోయారు. చెన్నై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి లంక టాపార్డర్ ను కుప్పకూల్చాడు. మరో మిస్టరీ స్పిన్నర్ అమిత్ మిశ్రా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సీమర్లు ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు చెరో వికెట్ తీశారు. శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత లంక కూడా కాస్త మెరుగ్గానే రాణించినా, భారత్ ను ఫాలో ఆన్ లో పడేయలేకపోయింది. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ భారత బ్యాట్స్ మెన్ బ్యాట్లు ఝుళిపించారు. చివరలో భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక కేవలం 134 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో భారత్ ఈ సిరీస్ ను 1-1తో సమం చేసుకోగలిగింది. ఇక మూడో టెస్టులో సత్తా చాటిన జట్టుకు కప్ దక్కనుంది.

  • Loading...

More Telugu News