: ఒక్కరోజే హైదరాబాదులో...మళ్లీ విజయవాడ క్యాంపు ఆఫీస్ కు చేరుకున్న చంద్రబాబు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కనీసం రాజధాని అంటూ లేకుండానే పాలన సాగించాల్సిన దుస్థితిలో టీడీపీ అధినేేత నారా చంద్రబాబునాయుడు పాలనా పగ్గాలు చేపట్టారు. అయితే సాధ్యమైనంత త్వరగా రాష్ట్రాన్ని ఒడ్డున పడేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. గత సోమవారం హైదరాబాదులోని ఇంటి నుంచి బయలుదేరిన ఆయన కర్నూలు, కడప జిల్లాల మీదుగా విజయవాడ చేరుకున్నారు. శనివారం దాకా అక్కడే బిజీబిజీగా గడిపారు. శనివారం రాత్రి హైదరాబాదు చేరుకున్నారు. నిన్న ఒక్క రోజే ఆయన హైదరాబాదులో ఉన్నారు. తిరిగి నేటి ఉదయమే విజయవాడ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించిన సన్నాహాల్లో ఆయన మళ్లీ బిజీగా మారిపోయారు. రేపటి ప్రధాని భేటీ కోసం నేటి సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరనున్నారు.