: రెండో టెస్టులో గెలుపు దిశగా భారత్
శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తొలి టెస్టును చేజేతులా పోగొట్టుకున్న టీమిండియా... రెండో టెస్టులో విజయం దిశగా సాగుతోంది. చివరి రోజు ఆట ప్రారంభమైన వెంటనే శ్రీలంక వికెట్లను పడగొట్టడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. 413 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక నిన్న ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. దీంతో, ఈ ఉదయం 341 పరుగులను ఛేదించే క్రమంలో శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, ఆదిలోనే లంకకు ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ మాథ్యూస్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, చండిమల్ 15 పరుగుల స్కోరు వద్ద, తిరిమన్నే 11 పరుగులు, ముబారక్ 0 పరుగుల వద్ద వెనువెంటనే ఔటయ్యారు. ఈ రోజు పడిపోయిన నాలుగు వికెట్లలో ఉమేష్ యాదవ్, మిశ్రా, అశ్విన్, ఇషాంత్ లు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 6 వికెట్ల నష్టానికి 111 పరుగులు. ఈ నేపథ్యంలో, ఎలాంటి అద్భుతం జరిగినా కూడా శ్రీలంక ఓటమి నుంచి తప్పించుకోవడం అసాధ్యమే.