: హస్తినలో భాగ్యనగరి పోలీసుల ‘ఉగ్ర’ వేట... ఇద్దరు హుజీ ముష్కరుల అరెస్ట్
ఉగ్రవాదులకు భాగ్యనగరి హైదరాబాదు అడ్డాగా మారుతోంది. నగరంపై పంజా విసిరేందుకు ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు. అయితే హైదరాబాదు పోలీసులు కూడా ఉగ్రవాదులకు ఎప్పటికప్పుడు షాకిస్తూనే ఉన్నారు. నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తున్న నగర పోలీసులు ఉగ్రవాదుల భరతం పడుతున్నారు. మొన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విధ్వంసానికి ప్లాన్ చేసిన హుజీ ముష్కరులను ముందుగానే పసిగట్టిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. తత్ఫలితంగా ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. నాడు పోలీసుల చేతికి చిక్కిన హుజీ ఉగ్రవాది నాసీర్ బెండు తీసిన పోలీసులు మరింత మంది ఉగ్రవాదులున్న విషయంపై పక్కా సమాచారాన్ని సేకరించారు. పోలీసుల ముప్పేట దాడితో హైదరాబాదు నుంచి పరారై దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు నిర్ధారించుకున్న నగర పోలీసులు అక్కడికి వెళ్లి వేట సాగించారు. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు షేక్ నూర్, హకీంలను అరెస్ట్ చేశారు. వీరిలో షేక్ నూర్ స్వస్థలం మెదక్ జిల్లా జహీరాబాదుగా పోలీసులు నిర్ధారించారు. ఢిల్లీలో అరెస్ట్ చేసిన వీరిద్దరిని పోలీసులు హైదరాబాదు తీసుకొచ్చారు. నాసీర్ కు వీరిద్దరూ సహకరించినట్లు కూడా పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.