: భూమి కోసం మురళీమోహన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు... మరి ఆ బాధ సామాన్యులకు ఉండదా?: పవన్ కల్యాణ్
రాజధాని కోసం ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కోవడం సరికాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం సందర్భంగా టీడీపీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ కు చెందిన సుమారు 15 ఎకరాల భూమి పోతున్నప్పుడు... ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. ఎంతో ఆస్తి ఉన్న, మురళీ మోహన్ గారే ఆఫ్టరాల్ కాస్త భూమి పోతుందని తెలిసినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారని... అలాంటప్పుడు, కొన్ని సెంట్ల భూమి ఉన్న పేద రైతుల నుంచి భూమిని బలవంతంగా లాక్కోవడం సమంజసం కాదని మండిపడ్డారు. ఆఫ్టరాల్ అనే పదం తాను సాధారణంగా వాడనని... కానీ, మంత్రి రావెల కిషోర్ బాబు గారు ఆఫ్టరాల్ మూడువేల ఎకరాల కోసం ఇంత రాద్ధాంతమా? అన్నట్టు మాట్లాడడం వల్లే ఇప్పుడు తాను ఆ పదం వాడుతున్నానని అన్నారు. మురళీమోహన్ గారు ఇక్కడకు వచ్చి రైతుల గోడు వినాలని కోరుకుంటున్నానని తెలిపారు. బలవంతపు భూసేకరణ వల్ల పేద రైతులు ఎంతో బాధ పడతారని చెప్పారు. భూమి ఇచ్చే వారి నుంచే భూములు తీసుకోవాలని... ఇవ్వని వారి నుంచి బలవంతంగా లాక్కోవద్దని స్పష్టం చేశారు.