: పవన్ కల్యాణ్ కోసం బారులు తీరిన ‘రాజధాని’ రైతులు... దిగుబడులు వెంట తెచ్చిన వైనం
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చేందుకు ఇష్టం లేని రైతులు పెనుమాకకు పోటెత్తారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. రాజధాని రైతుల పక్షాన ఏపీ ప్రభుత్వంపై పోరు ప్రకటించిన పవన్ కల్యాణ్ నేటి ఉదయం 7 గంటలకు హైదరాబాదులోని తన నివాసం నుంచి నవ్యాంధ్ర రాజధానికి రోడ్డు మార్గం మీదుగా బయలుదేరారు. 11 గంటలకల్లా ఆయన పెనుమాక చేరుకుంటారని భావించినా, 11.30 దాటిని ఆయన జాడ కనిపించలేదు. అయినా రైతులు ఆయన కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. తమ గోడు వెళ్లబోసుకోవడంతో పాటు తమ పొలాలు ఎంత విలువైనవో చెప్పేందుకు రైతులు తమ పొలాల్లో పండిన పంట ఉత్పత్తులను వెంట తీసుకుని మరీ అక్కడికి వచ్చారు. తమ విలువైన పంట ఉత్పత్తులను పవన్ కల్యాణ్ కు చూపించి తమ ఇబ్బందులను ఆయన ముందుంచుతామని వారు పేర్కొంటున్నారు.