: పాపమని లిఫ్టిస్తే... కత్తితో బెదిరించి లక్షలు దోచుకెళ్లిన దుండగుడు
పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలు సమీపంలోని బాదంపురి వద్ద కొద్దిసేపటి క్రితం భారీ దారి దోపిడీ జరిగింది. ఒంటరిగా హైవేపైకి వచ్చిన ఓ దుండగుడు, అటుగా వెళుతున్న కారును ఆపి లిఫ్ట్ అడిగాడు. ఎటూ కారులో ఖాళీ ఉందిగా అనుకున్న యజమాని అతడికి లిఫ్ట్ ఇచ్చాడు. అయితే కారులోకి ఎక్కించుకున్న తర్వాత కాని యజమానికి ఆ దుండగుడి విశ్వరూపం తెలిసిరాలేదు. కారెక్కి కొంతదూరం వెళ్లగానే దుండగుడు కత్తి తీసి కారు యజమానితో పాటు ఆయన సతీమణిని భయభ్రాంతులకు గురి చేశాడు. కారులో ఆ దంపతులు తీసుకెళుతున్న నగదును గుర్తించిన దుండగుడు, వారిని బెదిరించి ఆ బ్యాగును లాగేసుకుని ఎంచక్కా కారు దిగేశాడు. కత్తి చూపి బెదిరించడంతో మిన్నకుండిపోయిన ఆ దంపతులు ఆ తర్వాత దొంగ ఎత్తుకెళ్లిన బ్యాగులో రూ.8 లక్షలున్నాయని లబోదిబోమన్నారు. జరిగిన ఘటనపై సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదునందుకున్న పోలీసులు దుండగుడి కోసం హైవేపై సోదాలను ముమ్మరం చేశారు.