: ‘ప్యాకేజీ’ తర్వాతే ‘హోదా’ కోసం పట్టు... ఏపీ సర్కారు వ్యూహాత్మక ఎత్తుగడ!


ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందేనని రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు గొంతెత్తి నినదిస్తున్నాయి. అయితే ఏపీ సర్కారు మాత్రం ‘హోదా’ కంటే కూడా ‘ప్యాకేజీ’పైనే ముందుగా పట్టుబట్టాలని తలపోస్తోంది. ఇలా వ్యవహరిస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్న వాదనతో ముందుకెళుతోంది. ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయినా, ప్యాకేజీ అయినా ఈ భేటీలోనే నిర్ణయం జరగనుంది. అత్యంత కీలకమైన ఈ భేటీలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ముందుగా ప్యాకేజీ కోసం పట్టుబట్టి, అనుకున్న మేర నిధులు సాధించుకున్న తర్వాతే ‘హోదా’పై మాట్లాడాలని ఆయన ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ మేరకు ఏపీ ఉన్నతాధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రత్యేక హోదాతో కేవలం కొన్ని రాయితీలు మాత్రమే వస్తాయని చెబుతున్న అధికారులు, అందువల్ల ఒనగూరే ప్రయోజనం అంతంతమాత్రమేనని వాదిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా దేశంలోని 11 రాష్ట్రాలకు ఉందని, ‘హోదా’తో ఆయా రాష్ట్రాలకు చేకూరిన లాభం స్వల్పమేనని గణాంకాలతో వాదిస్తున్నారు. అదే ప్రత్యేక ప్యాకేజీ విషయంలో అనుకున్న అంశాలకు కేంద్రాన్ని ఒప్పించగలిగితే పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ అంశాల కింద ప్రత్యేక ప్యాకేజీని కోరనున్న చంద్రబాబు మొత్తం మీద రూ.25 వేల కోట్ల మేర సహాయాన్ని కోరనున్నారట. ఈ మేరకు ప్రధాని నుంచి హామీ లభించిన తర్వాత ‘హోదా’పై గళం విప్పాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ప్రధాని ముందు ఏపీ సర్కారు వ్యూహాత్మక ఎత్తుగడ ఏ మేరకు ఫలితాలిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News