: హైదరాబాదులో లాకప్ డెత్... పోలీసుల విచారణలో కుప్పకూలిన మహిళ
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో నిన్న రాత్రి లాకప్ డెత్ ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసులు జరుపుతున్న విచారణలో ఓ మహిళ కుప్పకూలిపోయి పోలీస్ స్టేషన్ లోనే ప్రాణాలు వదిలింది. అయితే ఈ ఘటనను దాచేందుకు యత్నించిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకెళితే, బోజగుట్టకు చెందిన మహిళ పద్మను ఓ చోరీ కేసు నిమిత్తం ఆసిఫ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ కు తీసుకువచ్చి నిన్న రాత్రి విచారణ పేరిట ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు కాని ఆమె ఉన్నపళంగా కుప్పకూలిపోయింది. దీంతో పద్మను పరిశీలించిన పోలీసులు ఆమె చనిపోయిందని రూఢీ చేసుకుని, తమ తప్పు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆ మృతదేహాన్ని చికిత్స కోసమంటూ ఉస్మానియాకు తరలించారు. అయితే ఈ విషయం మీడియాకు పొక్కింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు.