: నేడు నవ్యాంధ్రకు పవన్ కల్యాణ్... రైతులతో భేటీ తర్వాత చంద్రబాబుతో సమావేశం
జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ నవ్యాంధ్ర రాజధాని రైతుల పక్షానే నిలిచేందుకు నిర్ణయించుకున్నారు. రాజధాని నిర్మాణం కోసమంటూ ఏపీ సర్కారు భూసేకరణ చట్టం ప్రయోగానికి సిద్ధపడుతూ జారీ చేసిన నోటిఫికేషన్ పై భగ్గుమన్న పవన్ కల్యాణ్, షూటింగ్ ను అర్థాంతరంగా ముగించుకుని నిన్న మధ్యాహ్నానికే హైదరాబాదు వచ్చేశారు. వచ్చిన వెంటనే తన సన్నిహితులతో భేటీ అయిన ఆయన నవ్యాంధ్రలో పర్యటించేందుకే నిర్ణయించుకున్నారు. మరికాసేపట్లో హైదరాబాదు నుంచి బయలుదేరే పవన్ కల్యాణ్ నేరుగా నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని పెనుమాక చేరుకుంటారు. అక్కడి డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో ఆయన రాజధాని ప్రాంత రైతులతో సమావేశమవుతారు. భూసేకరణ చట్టం నోటిఫికేషన్ పై ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఆరా తీస్తారు. ఆ తర్వాత ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అవుతారు. పెనుమాక సమావేశంలో రైతులు వ్యక్తం చేసిన ఆందోళనలను ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.