: కాశ్మీర్ అంశం లేకుండా చర్చలు జరపలేము: పాక్ జాతీయ భద్రతా సలహాదారు
భారత్, పాకిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ఎస్ఏ) సమావేశంలో కాశ్మీర్ అంశం లేకుండా చర్చలు సాధ్యం కావని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ స్పష్టం చేశారు. అందుకే షరతులు లేకుంటే భారత్ తో చర్చలకు సిద్ధమని ఇస్లామాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. భారత్ తో చర్చలు ఫలవంతంగా సాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రెండు దేశాల మధ్య కాశ్మీర్ అంశం చాలా ముఖ్యమైనదని, అజెండాలోనే ఉందని తెలిపారు. ఈ అంశంపై విధివిధానాల గురించి చర్చించాలన్నారు. ఇక ఎన్ఎస్ఏ సమావేశం రద్దు అంశం భారత్ కే వదిలేస్తున్నామన్న అజీజ్, రద్దుపై భారత్ నుంచి అధికారిక ప్రకటన లేదని చెప్పారు. ఎలాంటి ప్రకటన రానందున ఆశాభావ దృక్పథంతో చర్చల కోసం ఢిల్లీ వెళుతున్నానని అజీజ్ పేర్కొన్నారు. అయితే హురియత్ నేతలతో మాట్లాడవద్దని భారత్ అనడం సరికాదన్నారు.