: పనితీరు మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు: బొండా ఉమ
పార్టీ ఎమ్మెల్యేలంతా పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించినట్టు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరం కృషి చేస్తామని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉన్న అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత ఉందని, అవసరమైతే ఆయనను కలసి వాస్తవాలు వివరిస్తామని చెప్పారు. అనవసరంగా రైతుల నుంచి సెంటు భూమి కూడా తీసుకోవట్లేదని బొండా స్పష్టం చేశారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో టీడీపీ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. రెండు రాష్ట్రాల్లో పార్టీ కమిటీల ఏర్పాటుపైన, కమిటీల పర్యవేక్షణకు కేంద్రస్థాయిలో ఎలా ఉండాలన్న దానిపైన సమావేశంలో చర్చించారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 25న ప్రధానమంత్రి నరేంద్రమోదీని సీఎం చంద్రబాబు కలసి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై మాట్లాడతారని చెప్పారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై కేంద్రంతో గట్టిగా మాట్లాడాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ విషయాలపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్య కార్యదర్శిని ఢిల్లీకి పంపించామని ఉమ వెల్లడించారు.