: అక్టోబర్ లో పెళ్లికొడుకు కాబోతున్న హర్భజన్
భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. తన గాళ్ ఫ్రెండ్ గీతా బస్రాను వచ్చే అక్టోబర్ లో పెళ్లి చేసుకోబోతున్నాడు. పంజాబ్ లోని జలంధర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫగ్వారాలో ఇద్దరి పెళ్లి వేడుక అక్టోబర్ 29న జరగనుందని హిందూస్తాన్ టైమ్స్ పత్రిక ప్రచురించిన కథనంలో వెల్లడించింది. దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్ లకు భజ్జీ సెలక్ట్ అయితే పెళ్లి తేదీ మారే అవకాశం ఉందని తెలిపింది. బాలీవుడ్ నటి అయిన గీతా బస్రాతో గత కొన్ని సంవత్సరాల నుంచి హర్భజన్ ప్రేమాయణం నడుస్తోంది. ఇంతవరకు బహిరంగంగా ఎప్పుడూ తమ ప్రేమ బంధం గురించి వారిద్దరూ చెప్పలేదు. అయితే గీతా తాజా చిత్రం 'సెకండ్ హ్యాండ్ హజ్బెండ్'లో భజ్జీ ప్రత్యేకంగా కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి పెళ్లి వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న భజ్జీ తిరిగిరాగానే వివాహ వేడుకలు, ఆహ్వానాలకు సంబంధించిన విషయాలలో ఓ నిర్ణయానికి వస్తారని మీడియా కథనాలు చెబుతున్నాయి.