: సండ్ర తన డ్రైవర్ ఫోన్ ను వాడారా?...అఫ్జల్ పాషాపై టీ ఏసీబీ ప్రశ్నల వర్షం


ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు విచారణ పర్వాన్ని మరింత ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి, ఉదయ సింహ, సెబాస్టియన్లతో పాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొన్న కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ లో రేవంత్, ఉదయ సింహ, సెబాస్టియన్ లతో పాటు జెరూసలెం మత్తయ్యల ప్రమేయానికి సంబంధించిన అంశాలను ఏసీబీ ప్రస్తావించింది. అయితే సండ్ర ప్రమేయానికి సంబంధించిన అంశాలను మాత్రం ప్రస్తావించలేదు. ఆయన ప్రమేయానికి సంబంధించి అనుబంధ చార్జీషీట్ దాఖలుకు ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సండ్ర పాత్రపై మరిన్ని ఆధారాలను సేకరించే పనిని ఏసీబీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నిన్న సండ్ర కారు డ్రైవర్ అఫ్జల్ పాషాను ఏసీబీ అధికారులు విచారించారు. నోటీసులు జారీ చేసి అఫ్జల్ పాషాను నిన్న తమ కార్యాలయానికి పిలిపించిన ఏసీబీ అధికారులు అతడిని సుదీర్ఘంగా విచారించారు. ఓటుకు నోటు వ్యవహారం జరిగిన సమయంలో సండ్ర, అఫ్జల్ పాషా ఫోన్ ను వాడినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. ఇదే విషయంపై అఫ్జల్ పాషాను ఏసీబీ అధికారులు ప్రశ్నించారట.

  • Loading...

More Telugu News