: ఐఎస్ అమ్ములపొదిలో ఎయిడ్స్ బాంబులు... స్పెషల్ ఆపరేషన్ కు సర్వం సిద్ధం!
ఐఎస్ కిరాతకాలు ఎన్ని అని చెప్పగలం! పైశాచికత్వానికి మారుపేరుగా నిలుస్తూ ప్రజలను కాల్చుకు తింటున్న ఆ ముష్కర మూక ఇప్పుడు కొత్త రకం ఆయుధాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. భీతిగొలిపే అంశం ఏమిటంటే ఆ ఆయుధాలు మనుషులే. మామూలు మనుషులు కాదు, ప్రాణాంతక హెచ్ఐవీ సోకిన మనుషులు. వారితో స్పెషల్ ఆపరేషన్ ప్లాన్ చేసిందట ఐఎస్ గ్రూపు. వారు ఎలాగూ ఎక్కువ కాలం బతకరు కాబట్టి, భారీ టార్గెట్ లపై వారితో దాడులు చేయించాలని, ఒకవేళ వారు దొరికిపోయిన పక్షంలో ఆత్మాహుతి చేసుకుంటే సమస్యేమీ ఉండదని ఐఎస్ వ్యూహకర్తలు భావిస్తున్నారట. వివరాల్లోకెళితే... ఐఎస్ మిలిటెంట్ గ్రూపులో ఇరాక్, సిరియా దేశస్తులే కాదు, పాశ్చాత్య దేశాలకు చెందినవారూ ఉన్నారు. కాగా, ఐఎస్ మిలిటెంట్లు మొరాకో దేశానికి చెందిన ఇద్దరు సెక్స్ బానిసలతో శృంగారంలో పాల్గొన్నారు. ఆ మహిళల నుంచి మిలిటెంట్లకు వైరస్ సోకినట్టు గుర్తించారు. ఓ 16 మందికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. దాంతో వారిని సిరియాలోని దీర్ ఎజ్ జోర్ ప్రావిన్స్ లో ఓ క్వారంటైన్ వార్డులో ఉంచారు. ఇప్పుడు వారు ఐఎస్ వ్యూహకర్తలకు పదునైన అస్త్రాల్లా కనిపిస్తున్నారు.