: తనను ఇంటర్వ్యూ చేసింది సంగక్కర భార్య అని అతడికి చివర్లో తెలిసింది!
శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కరకు కొలంబో టెస్టు తొలి రోజున సారా ఓవల్ మైదానంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంగక్కర అర్ధాంగి యెహాలి టీవీ రిపోర్టర్ అవతారమెత్తడం విశేషం. ఆమె మైక్ అందుకుని మైదానంలో ఉన్న ఓ ఆస్ట్రేలియా జాతీయుడిని ఇంటర్వ్యూ చేశారు. తాను ఆస్ట్రేలియా జాతీయుడినే అయినా, శ్రీలంక క్రికెట్ కు గట్టి మద్దతుదారుడినని ఆ వ్యక్తి వివరించాడు. ముఖ్యంగా, కుమార్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్స్ లో కుమార్ ఒకడని కొనియాడాడు. కుమార్ రిటైరవుతుండడం నిజంగా విచారకరమని, అయితే, అతని అద్భుత ఇన్నింగ్స్ లను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటామని పేర్కొన్నాడు. కాగా, ఇంటర్వ్యూ చేసిన యెహాలి తాను సంగా భార్యనని చివర్లో చెప్పడంతో అతనెంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. "మీకు తెలుసా?... నేను సంగా భార్యను. మీరెంతో చక్కగా మాట్లాడినందుకు థ్యాంక్స్" అంటూ ఇంటర్వ్యూ ముగించింది.