: వేల సంఖ్యలో కొత్త గృహాలు, కొనేవారు కరవు... ధరలు తగ్గించాల్సిందేనన్న ఆర్బీఐ గవర్నర్


దేశవ్యాప్తంగా అమ్ముడు పోని గృహాల సంఖ్య వేలల్లోకి చేరిన తరుణంలో, రియల్ ఎస్టేట్ డెవలపర్లు అపార్టుమెంట్ల ధరలను తగ్గించాల్సిందేనని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. గృహాల ధరలు తగ్గిన తరువాత మాత్రమే గృహ రుణాలపై ఉన్న నిబంధనలు సరళీకృతం చేసే అవకాశం లభిస్తుందని, అప్పుడే అమ్మకాలు ఊపందుకుంటాయని ఆయన అన్నారు. అమ్ముడుపోని గృహాల సంఖ్య రెండున్నరేళ్ల గరిష్ఠానికి చేరడానికి కారణం డెవలపర్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాంకుల క్రెడిట్ గ్రోత్ రేటు రెండు దశాబ్దాల కనిష్ఠానికి పడిపోయిందని, బేస్ రేటు కన్నా తక్కువ వడ్డీకి గృహ రుణాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, తొలుత ధరలు దిగివస్తేనే వడ్డీ రేట్లు తగ్గించే వీలుంటుందని రాజన్ అభిప్రాయపడ్డారు. ఇండ్ల ధరలు తగ్గించాల్సిందేనని హెచ్చరించారు. లేకుంటే వడ్డీ రేట్లు అధిక స్థాయుల్లోనే కొనసాగుతాయని, కొనేవారు మరింత వెనుకంజ వేసే స్థితి వస్తుందని గుర్తు చేశారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తుందని ముందే ఊహించి చెప్పిన ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న రాజన్, తొలుత అమ్ముడుకాని గృహాలపై దృష్టిని సారించాలని, వాటిని విక్రయించిన తరువాతనే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని నిర్మాణ రంగ వ్యాపారులకు పిలుపునిచ్చారు. ధరలు అధికంగా ఉన్నాయన్న అభిప్రాయం తొలగనంత కాలం డిమాండ్ పెరగబోదని అంచనా వేశారు.

  • Loading...

More Telugu News