: ఆస్ట్రేలియాలో రూ. 65 లక్షల ఖర్చయ్యే వైద్యానికి ఇండియాలో రూ. 65 వేలతో చికిత్స... ఉబ్బితబ్బిబ్బవుతున్న ఆస్ట్రేలియన్!


గ్రెగ్ జఫ్రీ... ఆస్ట్రేలియన్. ప్రాణాంతక హెపటైటిస్- సి సోకి, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవాడు. ఇప్పుడు... ఇండియాలో వైద్యవిధానం సామాన్యుడికి దగ్గరవుతున్న తీరు చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తన రోగాన్ని అతి తక్కువ ధరకు నయం చేసిన భారత్ కు సెల్యూట్ చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే, నాలుగు నెలల క్రితం జెఫ్రీకి 'లివర్ సిరోసిస్' వ్యాధి సోకింది. ఇది హెపటైటిస్ అడ్వాన్స్డ్ 'సీ' కేటగిరీ రోగం. దీన్నుంచి బయటపడాలంటే 'సివోల్డీ' అనే మాత్రలు 84 రోజుల పాటు వాడాల్సి వుంటుందని వైద్యులు తేల్చారు. ఒక్కో మాత్ర ఖరీదు 1000 ఆస్ట్రేలియన్ డాలర్లు. అంటే మొత్తం దాదాపు లక్ష అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 65 లక్షలు) వెచ్చిస్తేగాని చికిత్స పూర్తి కాదు. అంత కేటాయించే స్తోమత జెఫ్రీ దగ్గర లేదు. ఇండియాలోని చెన్నైకి వెళితే సులభ చికిత్స లభిస్తుందని ఎవరో చెబితే విని మూడు నెలల క్రితం భారత్ లో కాలు పెట్టాడు. మూడు నెలల పాటు చికిత్స తీసుకున్నాడు. కేవలం మాత్రలతోనే వ్యాధి నయమైంది. ఇందుకు జెఫ్రీ వెచ్చించిన మొత్తం 900 డాలర్లు. అంటే ఆస్ట్రేలియాలో అయ్యే ఖర్చుతో పోలిస్తే ఒక శాతం కన్నా తక్కువ. ఇదే విషయాన్ని చికిత్స తరువాత ఆస్ట్రేలియాకు వెళ్లిన జెఫ్రీ ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు. మృత్యు కౌగిట్లోకి వెళ్లాల్సిన తనను భారత వైద్యం ఎలా కాపాడిందో చెబితే, ఇదే వ్యాధితో బాధపడుతున్న వారి నుంచి రోజుకు 40 నుంచి 50 ఈ-మెయిల్స్ వచ్చాయని, వారందరికీ భారత చికిత్స గురించి చెబుతున్నానని పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుతం భారత్ లో 10 ఫార్మా కంపెనీలు హెపటైటిస్ వ్యాధికి ఔషధాలు అందిస్తుండగా, అందులో రెండు హైదరాబాద్ కంపెనీలే. చికిత్సకు ఉపయోగించే సోఫోస్ బువిర్ ఫార్ములేషన్స్ ఔషధాల 400 ఎంజీ డోసేజ్ బాటిల్ (28 టాబ్లెట్లు) రూ. 19,900 రూపాయలకు అందిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో జిలీడ్ అందిస్తున్న ఇదే తరహా ఔషధం ధరతో పోలిస్తే ఇండియా ధర 1/90 వంతు మాత్రమే!

  • Loading...

More Telugu News