: ఎల్పీజీ డీలర్ల కోసం వెతకాల్సిన అవసరం లేదు... ఇక ఆన్ లైన్లోనే దరఖాస్తు!


ఇకపై కొత్త వంట గ్యాస్ కనెక్షన్లు కావాలంటే ఎల్పీజీ డీలర్ ఎక్కడున్నాడన్న విషయమై వెతుకులాట అవసరం లేదు. ఆన్ లైన్లోనే చిరునామా తెలియపరుస్తూ కొత్త సిలిండర్ కనెక్షన్ ను బుక్ చేసుకోవచ్చు. ప్రధాని చేపట్టిన 'డిజిటల్ ఇండియా' ప్రచారంలో భాగంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆన్ లైన్ దరఖాస్తు విధానం దగ్గరవుతుందని సమాచారం. ఎల్పీజీ పోర్టల్ 'పహల్' ద్వారా కొత్త కనెక్షన్ కావాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే సమయంలో వారికి గ్యాస్ స్టవ్ కావాలన్నా ఆన్ లైన్లోనే బుక్ చేసుకునే సౌకర్యం కల్పించాలని చమురు సంస్థలు భావిస్తున్నాయి. ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు విడివిడిగా తమ వద్దకు వచ్చే గ్యాస్ కనెక్షన్ల ఆన్ లైన్ బుకింగ్ సేవలను అందిస్తాయని తెలుస్తోంది. వీటన్నింటి లింకులు 'పహల్'లో ఉంటాయి. దరఖాస్తు చేయగానే, సమీపంలోని డీలర్ ను గుర్తించే సాఫ్ట్ వేర్ 48 గంటల్లోగా కస్టమర్ ఐడీ సంఖ్యను అందిస్తుంది. ఇది రాగానే ఆన్ లైన్లో చెల్లింపు జరిపి వెరిఫికేషన్ అయ్యేంత వరకూ వేచి చూడాలి. వెరిఫికేషన్ పూర్తి కాగానే సదరు డీలర్ నుంచి రెగ్యులేటర్, సిలిండర్, రబ్బర్ పైపు కొత్త కస్టమర్లకు అందుతాయి. ఈ మొత్తం విధానం గరిష్ఠంగా వారం రోజుల వ్యవధిలో పూర్తవుతుంది. ఏవైనా సమస్యలు తలెత్తాయని భావిస్తే, ఫిర్యాదులు చేయడానికి ఓ నంబరును కూడా అందుబాటులో ఉంచుతారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

  • Loading...

More Telugu News