: ఎంఐఎం ముస్లిం పార్టీ కాదంటున్న అసదుద్దీన్ ఓవైసీ
ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్... షార్ట్ కట్ లో ఎంఐఎం ఇక ఎంతమాత్రమూ ముస్లిం పార్టీ కాదని ఆ పార్టీ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ఎకనమిక్ టైమ్స్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. హైదరాబాదులోని పాతబస్తీలో మంచి పట్టున్న ఆ పార్టీ, ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. మొన్నటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలియత్నంలోనే ఏకంగా 25 స్థానాల్లో పోటి చేసిన ఆ పార్టీ రెండు సీట్లను కైవసం చేసుకుంది. ఇక తాజాగా బెంగళూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ బరిలోకి దిగుతోంది. ఈ సందర్భంగా బెంగళూరులో అసదుద్దీన్ పర్యటనకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ససేమిరా అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన అసదుద్దీన్, తమ పార్టీ ముస్లిం పార్టీ కాదని వ్యాఖ్యానించారు. హైదరాబాదు నగర మేయర్లుగా పనిచేసిన తమ పార్టీ నేతల్లో ముగ్గురు హిందువులు ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని, ఆ సమయంలో సిద్దరామయ్య తనను ఎలా అడ్డుకుంటారో చూస్తానని కూడా ఓవైసీ వ్యాఖ్యానించారు.