: ఇక తన వల్ల కాదంటూ, రాజీనామా చేసిన గ్రీస్ ప్రధాని
సంక్షోభంలో కూరుకుపోయిన గ్రీస్ ను బయటకు తేవడం తన వల్ల కాదంటూ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ చేతులెత్తేశారు. ఏడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధాని పీఠం అధిరోహించిన ఆయన బెయిలౌట్ డీల్ ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. రుణ దాతలు విధించిన షరతులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేసిన ఆయన, తన విధానానికే కట్టుబడ్డారు. సంక్షోభం నుంచి బయటపడేందుకు మరో మార్గం కనిపించకపోవడంతో తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. సిప్రాస్ తన రాజీనామా లేఖను అధ్యక్షుడు ప్రొకోపిస్ పావ్ లోపౌలస్ కు అందించారు. సాధ్యమైనంత త్వరలో ఎన్నికలు జరపాలని కోరారు. సెప్టెంబర్ 20న ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది. కాగా, 2010 తరువాత గ్రీస్ లో ఎన్నికలు జరగడం ఇది మూడోసారి. ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి ఉన్నానని, ప్రజలు తనకు మద్దతిస్తున్నారని చెప్పేందుకే ఆయన మరోసారి ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు నిపుణులు వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరిగితే, ఆయన నేతృత్వంలోని 'జైరిజా' పార్టీకి ప్రజలు మరోసారి పట్టం కట్టవచ్చని అంచనా.