: కేసీఆర్ పై యువత బాహుబలిలా తిరగబడతారు... మాజీ డిప్యూటీ సీఎం దామోదర
ఉమ్మడి రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత మెదక్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ఆందోల్ లో ఓటమి చవిచూసిన దామోదర, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తరహాలో దాదాపుగా కనుమరుగయ్యారు. నిన్న మీడియా ముందుకు వచ్చిన దామోదర తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ‘‘పూట గడిపే మాటలతో గారడీ చేస్తున్న సీఎం కేసీఆర్ పై యువకులంతా బాహుబలిలా తిరగబడతారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే దళితుడినే సీఎం చేస్తానన్నావు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేస్తానన్నావు. ఏడాదికి లక్ష ఉద్యోగాలిస్తానన్నావు. ఏ ఒక్క హామీనైనా నెరవేర్చావా? తెలంగాణ ప్రజలు, యువకులు గుడ్డివారు కారు. ఓర్పు నశిస్తే బాహుబలిలా తిరగబడతారన్న విషయం తెలుసుకో’’ అంటూ ఆయన కేసీఆర్ పై వాగ్బాణాలు సంధించారు.