: గంగిరెడ్డి పెళ్లి కొడుకవుతున్నాడట!...‘ఎర్ర’ కేసు నుంచి ‘రక్షణ’ కోసం మారిషస్ మహిళతో పెళ్లికి సన్నాహాలు


ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్ గా ఎదిగిన కొల్లం గంగిరెడ్డిని ఏపీ పోలీసులు ఇక రాష్ట్రానికి తీసుకురాలేరేమో. ఎందుకంటే పోలీసుల దర్యాప్తుపై ఎప్పటికప్పుడు పక్కా సమాచారం సేకరిస్తున్న అతడు, పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాడు. ఇప్పటికే మారిషస్ జైల్లో ఉన్న అతడిని ఏపీకి తీసుకువచ్చేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయంలో ఏపీ పోలీసులు కేంద్రం సహకారం కూడా అభ్యర్థించారు. అయితే ఈ వ్యవహారాలన్నింటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న గంగిరెడ్డి, మారిషస్ లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే దిశగా పకడ్బందీగా అడుగులు వేస్తున్నాడు. ఇందుకోసం అతడు పెళ్లి కొడుకు అవతారం ఎత్తనున్నాడు. మారిషస్ కు చెందిన యువతిని పెళ్లి చేసుకునేందుకు గంగిరెడ్డి సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. మారిషస్ కు చెందిన మహిళను పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. ఇదే జరిగితే, తమ దేశ పౌరసత్వం ఉన్న వ్యక్తిని మారిషస్ డిపోర్టేషన్ (ఇతర దేశాల అభ్యర్థన మేరకు తమ దేశం నుంచి బహిష్కరించడం) చేయదు. ఏపీ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మారిషస్ మహిళతో పెళ్లి ఒక్కటే మార్గమన్న అక్కడి న్యాయవాదుల సలహాతో గంగిరెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే గంగిరెడ్డి సోదరుడితో పాటు వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు కూడా మారిషస్ వెళ్లి అతడిని కలిసి వచ్చారు. ఈ క్రమంలో కూపీ లాగిన ఏపీ పోలీసులకు గంగిరెడ్డి పెళ్లి సన్నాహాలు తెలిసివచ్చాయి.

  • Loading...

More Telugu News