: డ్రైవింగ్ పై కఠిన నిబంధనలు సిఫారసు చేసిన కమిటీ
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ కమిటీ కఠిన నిబంధనలు సూచించింది. నిర్దిష్ట వేగాన్ని మించి డ్రైవ్ చేసినా, సిగ్నల్ జంప్ చేసినా, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ లో మాట్లాడినా, డ్రంకన్ డ్రైవ్ చేసినా, గూడ్స్ వాహనంలో పరిమితికి మించి బరువు వేసుకున్నా, ప్రయాణికులను ఎక్కించుకున్నా భారీ జరిమానాతో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని సూచించింది. వాహనాన్ని డ్రైవ్ చేసే వారే కాకుండా, వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధారణ తప్పనిసరి అని కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నిబంధనలను సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలంటూ కమిటీ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రతి మూడు నెలలకు తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలని స్పష్టం చేసింది. మద్యం, మాదకద్రవ్యాల మత్తులో వాహనం నడిపితే మోటారు వాహన చట్టంలోని 185 సెక్షన్ ప్రకారం ప్రాసిక్యూట్ చేసి జైలు శిక్ష విధించాలని స్పష్టం చేసింది. నేరం మొదటిసారి చేసినా శిక్ష విధించాల్సిందేనని తెలిపింది. టూవీలర్ వెనుక హెల్మెట్ లేకుండా కూర్చున్నా, ఫోర్ వీలర్ లో సీట్ బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే భారీ జరిమానా విధించాలని, రెండు గంటలకు తగ్గకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలని తెలిపింది.