: 50 వేల మందితో విలసిల్లిన నగరం...అభివృద్ధి మాటున నిర్మానుష్యంగా మారింది
అభివృద్ధి అంటే పరిశ్రమలు, వందల సంఖ్యలో అపార్ట్ మెంట్లు, పదుల సంఖ్యలో పాఠశాలలు, రవాణా సౌకర్యాలు, క్రీడా ప్రాంగణాలు, సినిమా థియేటర్లు, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు, రెస్టారెంట్లు అని భావించే వారి కళ్లు తెరిపించే ఘటన పాతికేళ్ల క్రిందట సోవియట్ యూనియన్ లో సంభవించింది. పైన పేర్కొన్న సౌకర్యాలన్నీ కలిగి, 50 మంది జనాభాతో విలసిల్లిన నగరం కేవలం రెండే రెండు రోజుల్లో నిర్మానుష్యంగా మారింది. 29 ఏళ్లుగా పరిశోధకులు, ఇప్పుడిప్పుడే పర్యాటకులు మినహా ఎవరూ వెళ్లేందుకు సాహసించడం లేదు. వివరాల్లోకి వెళ్తే... ఉక్రెయిన్ లోని ప్రిప్యత్ నగరాన్ని 1970 ఫిబ్రవరి 4న చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రం దగ్గర్లో ప్రారంభించారు. అణు విద్యుత్ కేంద్రంలో విధులు నిర్వర్తించే ఉద్యోగుల కోసం 13 వేలకు పైగా అపార్టుమెంట్లు నిర్మించారు. వారి పిల్లల విద్య కోసం 15 ప్రాథమిక, 5 ఉన్నత పాఠశాలలు ఒక వృత్తి విద్యా కళాశాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి, రవాణా సౌకర్యం ఇలా అన్ని ఆధునిక హంగులు ఏర్పాటు చేశారు. అప్పటి సోవియట్ యూనియన్ నలుమూలల నుంచి 80 వేల మందికి ఉపాధి కల్పించాలని భావించారు. ఈ క్రమంలో 50 వేల మంది ఆ పట్టణానికి చేరుకున్నారు. పదహారేళ్ల పాటు అక్కడ జీవనం హాయిగా సాగిపోయింది. 1986 ఏప్రిల్ 26న చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో నాలుగో రియాక్టర్ లో భారీ పేలుడు సంభవించింది. ఎగసిపడుతున్న మంటలను చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున దగ్గర్లో ఉన్న బ్రిడ్జ్ మీదకి వెళ్లారు. మామూలు ప్రమాదమేనని భావించిన అధికారులకు అదెంత పెద్ద ప్రమాదమో గుర్తించేందుకు క్షణాలు పట్టలేదు. అణు రియాక్టర్ నుంచి వెలువడిన రేడియేషన్ కారణంగా దగ్గర్లోని వారు క్షణాల్లో ప్రాణాలు కోల్పోతే, కొంత మంది స్పృహ కోల్పోయారు. దీంతో యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం రెండే రోజుల్లో ఉన్నపళంగా 50 వేల మందిని ఖాళీ చేయించింది. గత 29 ఏళ్లుగా అక్కడ ఎవరూ లేకపోవడంతో రోడ్లమీదే ఆటవస్తువులు, సామాన్లు ఇలా కనపడుతుంటాయి. కొన్ని వందల ఏళ్ల పాటు ఆ నగరం నివాసయోగ్యం కాదని నిపుణులు తేల్చేశారు. మౌలిక సదుపాయల కల్పన పేరిట అభివృద్ధి అని గొంతు చించుకుంటున్న నేతలు గత అనుభవాలను గుర్తుంచుకుని భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవాలనడానికి చక్కని ఉదాహరణ ప్రిప్యత్ నగర అనుభం.