: చంద్రబాబు పెద్ద శని అయితే, రేవంత్ రెడ్డి చిన్న శని: జూపల్లి
తెలంగాణ కోసం ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఏనాడూ స్పందించలేదని టీఎస్ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. కొడంగల్ లో మార్కెట్ యార్డు శంకుస్థాపన సందర్భంగా రేవంత్ రెడ్డి కోసం గంటసేపు వేచి చూశానని... ఆయనే రాలేదని మండిపడ్డారు. సభ్యత, సంస్కారం ఉండబట్టే తాను వేచి చూశానని అన్నారు. తెలంగాణ పాలిట చంద్రబాబు పెద్ద శని అయితే, రేవంత్ రెడ్డి చిన్న శని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎలాంటి వాడో ప్రజలందరికీ తెలుసని అన్నారు. మార్కెట్ యార్డ్ ప్రారంభం అనంతరం జూపల్లి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం జూపల్లికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టడం, రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత విడుదల చేయడం తెలిసిందే.