: లంక దిగ్గజానికి బీసీసీఐ సన్మానం
కొలంబో టెస్టుతో క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కరను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్మానించింది. కొలంబో టెస్టులో గురువారం ఆట ఆరంభానికి ముందు సంగక్కరను బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ... "సంగక్కర నిజంగా దిగ్గజ ఆటగాడు. మైదానంలోనూ, వెలుపల అతడి వ్యక్తిత్వం ఉన్నతమైనది. ఈ తరం ఆటగాళ్లలో అత్యంత నిలకడ కనబర్చిన వారిలో అతనొకడు. భవిష్యత్తులోనూ సంగాకు మంచే జరగాలని బీసీసీఐ కోరుకుంటోంది" అని తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కూడా సంగాకు శుభాకాంక్షలు తెలిపారు. సంగక్కర కేవలం శ్రీలంక క్రికెట్ ఆస్తి మాత్రమే కాదని, క్రికెట్ క్రీడకు గొప్ప ప్రతినిధి అని కొనియాడారు.