: బాలుడిని సంతోషపెట్టిన నారా లోకేశ్
ప్రాణాంతక, అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల చివరి కోరికను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న మేక్ ఏ విష్ ఫౌండేషన్ మరో చిన్నారి ముఖంలో నవ్వులు విరబూయించింది. కడప జిల్లాకు చెందిన వంశీకృష్ణ అనే బాలుడిని మందులకు నయం కాని వ్యాధి పట్టి పీడిస్తోంది. అయితే, ఆ చిన్నారికి టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ అంటే ఎంతో ఇష్టం. లోకేశ్ ను కలవాలన్న ఆ బాలుడి కోరిక గురించి మేక్ ఏ విష్ ఫౌండేషన్ కు తెలిసింది. వారు ఈ విషయాన్ని లోకేశ్ కు తెలపగా, ఆయన పెద్ద మనసుతో వంశీకృష్ణను కలిసేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో, ఫౌండేషన్ సభ్యులు ఆ బాలుడిని హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకెళ్లారు. తనను అభిమానించే వంశీకృష్ణతో లోకేశ్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆరోగ్యం సంతరించుకోవాలని ఆకాంక్షించారు. అంతేగాకుండా, ఆ బాలుడికి పలు పుస్తకాలు, ట్యాబ్ ను ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున వైద్యానికయ్యే ఖర్చులు అందజేస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్ తనపై చూపిన ప్రేమకు ఆ చిన్నారి ముఖం సంతోషంతో వెలిగిపోయింది.