: ఒక్కరోజులో రూ. 1000 పెరిగిన కిలో వెండి ధర, రూ. 365 పెరిగిన బంగారం
బులియన్ మార్కెట్ హైజంప్ చేసింది. శుభకార్యాల సీజను కొనసాగుతుండటంతో, ఆభరణాల కొనుగోళ్లు పెరగడం, స్టాకిస్టులు, ఆభరణాల తయారీదారుల నుంచి వచ్చిన మద్దతుతో బంగారం, వెండి ధరలు దూసుకెళ్లాయి. నాణాల తయారీదార్లు, పారిశ్రామిక వర్గాల నుంచి వస్తున్న కొనుగోళ్లు సైతం ఆశాజనకంగా ఉన్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. గురువారం నాటి బులియన్ సెషన్లో కిలో వెండి ధర ఏకంగా రూ. 1000 పెరిగి రూ. 36,300కు చేరింది. ఇదే సమయంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 365 పెరిగి 26,700కు చేరింది. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 1,139 డాలర్లుగా ఉండగా, వెండి ధర 15.38 డాలర్ల వద్ద కొనసాగుతోంది.