: తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ మెట్రో పాలిటన్ చీఫ్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ కి సిట్ నోటీసులు అందజేయనుంది. కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హోంశాఖ వద్ద ఉన్న కాల్ డేటా భద్రపరచాలని నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు సిట్ అధికారుల బృందం హైదరాబాద్ వచ్చినట్టు తెలిసింది. గతంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సహా పలువురు చేసిన ఫిర్యాదులపై సిట్ విచారణ చేసింది. ఈ విచారణలో భాగంగానే తాజాగా నోటీసులు ఇస్తోంది. గత రెండు నెలల్లో జరిగిన విచారణ క్రమంలో 9 మంది సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సిట్ కాల్ డేటా సేకరించింది. ట్యాపింగ్ పై ఆదేశాలు మౌఖికంగా ఇచ్చారా? లేక లిఖిత పూర్వకంగా ఇచ్చారా? అనే అంశంపై కూలంకషంగా విచారణ చేసింది. తెలంగాణలో ఓ ముఖ్య అధికారి నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని గతంలో సిట్ విచారణలో టెలిఫోన్ ఆపరేటర్లు చెప్పారు. దానికి సంబంధించి ముందుగా కోర్టులో మెమో దాఖలు చేసిన సిట్ అధికారులు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.