: దేశంలో అవినీతి మచ్చలేని సీఎం కేసీఆరే!: మంత్రి తలసాని


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తన ప్రశంసలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాశానికెత్తేశారు. దేశంలో అవినీతి మచ్చలేని సీఎం ఎవరంటే కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. తెలంగాణ సచివాలయంలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి విషయంలో అనవసర రాద్ధాంతం చేయవద్దని, తప్పు జరిగితే సూటిగా చెప్పాలని, ఆ వెంటనే సరి చేసుకుంటామని అన్నారు. రైతులకు 9 గంటల విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్వరలోనే అమలవుతుందని చెప్పారు. కర్ణాటకలోని గిరిజాపూర్ జలాశయం నిర్మిస్తే మహబూబ్ నగర్ ప్రజలు ఇబ్బంది పడతారని మంత్రి వివరించారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది గనుక ఆ పార్టీ నేతలు జలాశయ నిర్మాణం ఆపవచ్చు కదా? అని ప్రశ్నించారు. అంతేగాక కృష్ణానదిపై కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ బ్యారేజీ గురించి సోనియాగాంధీతో మాట్లాడి ఆపించవచ్చు కదా? అని తలసాని నిలదీశారు.

  • Loading...

More Telugu News