: ఎల్లై సామీ... నీవే కాపాడాలి తండ్రీ!: పోలీసుల జంతుబలి
దేశంలో ఇంకా మూఢాచారాలు కొనసాగుతూనే ఉన్నాయనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో పొన్ మలై ప్రాంత పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసులు ఎక్కువైపోవడంతో తట్టుకోలేక "దేవుడా నీవే దిక్కు" అంటూ జంతుబలి ఇచ్చారు. ఓ రకంగా క్షుద్రపూజలు నిర్వహించారనే చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో పొన్ మలై పీఎస్ పరిధిలో కేసులు అధికమయ్యాయట. పదుల సంఖ్యలో ఆత్మహత్య కేసులు, పెద్ద సంఖ్యలో హత్య కేసులు, దోపిడీ కేసులు నమోదయ్యాయి. ఆ కేసులను పరిష్కరించలేక పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒక కేసు దర్యాప్తు చేస్తుండగానే మరొకటి వచ్చి పడుతుండడంతో ఏంచేయాలో తోచక "ఎల్లై సామీ... కాపాడు తండ్రీ" అంటూ దోష నివారణ పేరిట జంతువులను బలి ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఎల్లై సామి దేవాలయం ఉంది. సీఐ రాజేంద్రన్ ఆధ్వర్యంలో తరలివెళ్లిన పోలీసు బృందం ఆలయంలో రక్తం చిందించి వచ్చిందట. మరి సామి కరుణిస్తాడో, లేదో చూడాలి!