: అదరగొట్టిన విజయ్ 'పులి' ట్రైలర్, 5 లక్షల మంది చూసేశారు... ఇంతకీ ఇందులో ఏముందంటే!
అభిమానులు ముద్దుగా 'ఇళయదళపతి' అని పిలుచుకునే తమిళ స్టార్ విజయ్ నటించిన సోషియో ఫాంటసీ చిత్రం 'పులి' ట్రైలర్ యూట్యూబ్ లో విడుదల కాగా, సుమారు 5 లక్షల మంది దాన్ని చూశారు. ఈ ట్రైలర్ వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. మొత్తం 114 సెకన్ల నిడివిగల ఈ ప్రచార వీడియోలో విజయ్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఉంది. "పాసెత్తుకు మున్నాడిదా నా పని, పగయిక్కు మున్నాడినా పులి" (ప్రేమకు కట్టుబడేందుకే ఉన్నా, అదే పగ అయితేనా... పులిని) అన్న విజయ్ డైలాగుతో పాటు పలు ఆంగ్ల చిత్రాలను గుర్తుకు తెచ్చే సీన్లు ఇందులో ఉన్నాయి. చుట్టూ నీటి మధ్యలో ఓ పెద్ద సామ్రాజ్యం, భారీ కోట గోడల మధ్య యుద్ధ వేదిక, పొడవాటి జుట్టుతో సింహాసనంపై కూర్చున్న సుదీప్, మహారాణిగా 'మేల్ ఫిసెంట్' చిత్రంలో ఏంజెలినా జూలీ పాత్రను గుర్తుకు తెచ్చేలా మెరిసిన శ్రీదేవి, కొన్ని పోరాట దృశ్యాలు ఉన్నాయి. వీటితో పాటు అరచేతిలో ఇమిడేంత మనుషులు (లిల్లీపుట్స్- ఇందులో ఓ లిల్లీపుట్ గా అలీ కూడా ఉన్నాడండోయ్), ఇనుప సంకెళ్లతో బంధించబడ్డ భారీ రాక్షస కాయుడు (హుల్క్ మాదిరి), విజయ్ పైకి ఓ నల్లటి చిరుత దూకడం, శృతి హసన్, హన్సికల డ్యాన్స్ దృశ్యాలు ఉన్నాయి. ఈ చిత్రం శిబుదేవన్ దర్శకత్వంలో వస్తుండగా, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగతి తెలిసిందే.