: రెనాల్ట్- నిస్సాన్ లో 3 వేల మందికి ఉద్వాసన? ... కార్ల అమ్మకాలు తగ్గడమే కారణం


సరికొత్త మోడళ్లతో భారత కార్ల మార్కెట్ లో సత్తా చాటిన రెనాల్ట్-నిస్సాన్ మోటార్స్... ఐదేళ్లు తిరగకముందే మైక్రా, డస్టర్, టెర్రానో మోడళ్లతో తల పట్టుకుంది. క్రమంగా విక్రయాలు సన్నగిల్లుతున్న క్రమంలో వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే ఇప్పటికే తమిళనాడులోని ఒరగడమ్ లో రూ.4,500 కోట్లతో సొంతంగా భారీ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్న ఈ జపనీస్ కంపెనీ క్షణాల్లో బిచాణా ఎత్తేయలేదు కదా? మరేం చేయాలి? ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకోవాలి. అదే క్రమంలో భారంగా మారిన ఉద్యోగులను తొలగించాలి. ప్రస్తుతం ఆ కంపెనీ అదే పనిచేస్తోంది. ఒరగడమ్ లోని ప్లాంట్ కు చెందిన సిబ్బందిలో ఏకంగా 3 వేల మందికి ఉద్వాసన పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక ప్రస్తుతం గంటకు 40 కార్లను ఉత్పత్తి చేస్తున్న ఈ కంపెనీ, ఇకపై గంటకు 20 కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనుంది. అంటే ఉత్పత్తిలో సగానికి సగం తగ్గించుకోవడమేనన్నమాట. సిబ్బంది కోతలో ఇప్పటికే పనిచేస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్న కంపెనీ ప్రతినిధి... కొత్తగా ట్రైనీలను, క్యాజువల్ లేబర్ ను, అప్రెంటీస్ లను తీసుకోరాదని నిర్ణయించామని చెప్పారు.

  • Loading...

More Telugu News