: లంచం కేసులో గోవా సీఎం బావమరిది అరెస్ట్...జోక్యం చేసుకోబోనన్న లక్ష్మీకాంత్ పర్సేకర్


దేశంలోనే పర్యాటక రంగంలో అగ్రభాగాన ఉన్న గోవా రాష్ట్రాన్ని అవినీతి కేసులు సతమతం చేస్తున్నాయి. ఇప్పటికే ఓ అవినీతి కేసులో నిండా మునిగిన గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ నిన్న ఆ రాష్ట్ర కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ తో తృటిలో అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. అయితే కామత్ కు అరెస్ట్ నుంచి ఉపశమనం కలిగిన రోజే సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ బావమరిది దిలీప్ మాల్వాంకర్ ను గోవా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ (జీఐడీసీ)లో ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మాల్వాంకర్, టుయిమ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఓ ఫ్లాట్ కేటాయింపు కోసం రూ.లక్ష మేర లంచం డిమాండ్ చేశారట. దీంతో ఒళ్లు మండిన బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఏసీబీ, ఆధారాలు లభించడంతో ఆయనను అరెస్ట్ చేసింది. ఇక ఇదే కేసుతో సంబంధం ఉన్న జీఐడీసీకి చెందిన మరో అధికారి అజిత్ గౌనేకర్ ను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ లపై సీఎం పర్సేకర్ స్పందించారు. మాల్వాంకర్ తన బంధువేనని ప్రకటించిన పర్సేకర్, కేసులో మాత్రం జోక్యం చేసుకోబోనని చెప్పారు.

  • Loading...

More Telugu News