: 27 ఏళ్లు ఐపీఎస్ అధికారిగా పనిచేశా, నన్ను తీసేశారు... ఎవరైనా ఉద్యోగమిస్తారా?
సంజీవ్ భట్... గుజరాత్ ఐపీఎస్ అధికారి. 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్ల వెనుక నరేంద్ర మోదీ హస్తం ఉందని తొలిసారిగా ఆరోపించి సంచలనం సృష్టించిన వ్యక్తి. ఆ తరువాత మోదీ ముఖ్యమంత్రి కాగా, సుప్రీంకోర్టు నియమించిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఆయనపై వచ్చిన ఆరోపణలను కొట్టేసింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను 2011లో సంజీవ్ భట్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు విధుల నుంచి పూర్తిగా తొలగించింది. దీనిపై ఆయన ఫేస్ బుక్ లో స్పందించారు. "27 సంవత్సరాల పాటు ఇండియన్ పోలీస్ సర్వీస్ లో విధులు నిర్వహించిన తరువాత, చివరకు నన్ను తొలగించారు. ఇప్పుడు మరో ఉద్యోగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా ఉద్యోగమిస్తారా?" అని ట్వీట్ చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, విచారణ సక్రమంగా జరపలేదని ఆయన ఆరోపించారు. ఓ మహిళతో భట్ గడిపిన 11 నిమిషాల వివాదాస్పద వీడియో ఆధారంగా ఆయన్ను విధుల నుంచి తొలగించినట్టు అధికారులు వెల్లడించగా, అందులో ఉన్నది తాను కాదని భట్ చెబుతున్నారు.