: రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఉద్రిక్తత
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ లో నేడు మంత్రి జూపల్లి పర్యటిస్తున్నారు. మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సవానికి ఆయన వచ్చారు. అయితే, ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే అయిన తనను ఎందుకు ఆహ్వానించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా, మంత్రి జూపల్లిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ రేవంత్ ధర్నాకు దిగారు. ఈ క్రమంలో, పరిస్థితులు చేజారకుండా, ముందస్తు జాగ్రత్త చర్యగా రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ కు రేవంత్ ను తరలించారు. దీంతో, టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి, ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో కొడంగల్ లో ప్రస్తుత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.