: హస్తినకు చేరిన గవర్నర్... నేడు రాజ్ నాథ్, జైట్లీలతో భేటీ
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నిన్న దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. నేడు ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో పాటు హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలపై కేంద్రం సమాలోచనలు చేస్తున్న తరుణంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 పరిధిలోని సంస్థల విభజన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఇదివరకే గవర్నర్ కు కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా గవర్నర్ సదరు కమిటీపై సమగ్రంగా చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. అంతేకాక ఏపీకి ఏ మేర ప్యాకేజీ అవసరమన్న విషయంపైనా కేంద్ర మంత్రులు గవర్నర్ ను ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.