: ఆ నాలుగు నిమిషాల వీడియో చూస్తే నిలువెల్లా కదిలిపోతాం!


భారత్ లో రైతుల ఆత్మహత్యల పర్వం ఇంకా అక్కడక్కడా కొనసాగుతూనే ఉంది. అన్నదాతల బలవన్మరణాల కారణంగా వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. బడిలో ఉండాల్సిన పిల్లలు బతుకు పోరు బాట పట్టాల్సిన దుస్థితి! అన్నేళ్లూ కంటికి రెప్పలా పెంచిన తండ్రి కనిపించని లోకాలకు వెళితే, ఆ చిన్నారులకు ఓదార్పేదీ? వారెంత తల్లడిల్లిపోతారో కదా! దీనిపై స్కైమెట్ వాతావరణ సంస్థ నాలుగు నిమిషాల నిడివితో ఓ వీడియో రూపొందించింది. కఠిన హృదయులు సైతం ఈ వీడియో చూస్తే నిలువెల్లా కరిగిపోతారు. ఆ వీడియోలో ఓ రైతు కుమార్తె ఆందోళనను మనసుకు హత్తుకునే రీతిలో ఆవిష్కరించారు. రైతుల ఆత్మహత్యల గురించి తెలుసుకున్న ఓ బాలిక ఏం చేసిందన్నది అందులో చూడొచ్చు. ఆమె తండ్రేమీ ఆత్మహత్య చేసుకోలేదు. కానీ, రైతుల ఆత్మహత్యలతో భయపడిపోయిన ఆ అమాయకురాలు తన తండ్రి కూడా వారిలాగా ఆత్మహత్య చేసుకుంటాడేమోనని అనుక్షణం ఆందోళన చెందుతుంటుంది. రైతులు ఉరివేసుకుని చనిపోతారని విన్న ఆ బాలిక ఇంట్లోని పెద్ద తాడును తండ్రికి కనపడకుండా దాచి పెడుతుంటుంది. ప్రతి క్షణం తండ్రి కదలికలను గమనించడం, ఏమాత్రం అనుమానాస్పదంగా కనిపించినా, భయపడిపోవడం... ఆ బాలిక దినచర్యగా మారిపోతుంది. అయితే, ఓ రోజు ఇంట్లోని తాడు కనిపించదు. అప్పుడు ఆ బాలిక వేదన వర్ణనాతీతం. దాంతో, చేతిలో ఉన్న పుస్తకాన్ని పక్కన పడేసి, తండ్రి కోసం పొలం వెళుతుంది. అక్కడ కనిపించిన దృశ్యం ఆ బాలికను నిశ్చేష్టురాలిని చేస్తుంది. తండ్రి ఆ తాడును ఓ చెట్టు కొమ్మపైకి విసురుతుంటాడు. అది చూసిన బాలిక "నాన్నా" అంటూ పరుగుపరుగున వెళ్లి తండ్రిని కౌగిలించుకుని భోరున విలపిస్తుంది. అప్పుడా తండ్రి "ఏమైందమ్మా?" అని అడుగుతాడు. అప్పుడా చిన్నారి తండ్రికి విషయం చెబుతుంది. "అదేం లేదులేమ్మా"... అంటూ ఆ తాడుకు కట్టిన టైరులో బాలికను నిల్చుండబెట్టి ఉయ్యాలలా ఊపడం... ఆపై ఆ చిన్నారి ముఖంలో నవ్వులు విరబూయడంతో కథ సుఖాంతమవుతుంది. చివర్లో స్కైమెట్ ఓ సందేశం పొందుపరిచింది. కచ్చితమైన వాతావరణ అంచనాలు అందుబాటులో లేకపోవడం కూడా రైతుల వెతలకు కారణమవుతోందని, స్కైమెట్ కచ్చితమైన వాతావరణ వివరాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృతనిశ్చయంతో ఉందని పేర్కొంది.

  • Loading...

More Telugu News