: సత్తా చాటేందుకు విదేశీ ఆటగాళ్లతో ప్రాక్టీసు చేస్తున్న రైనా


పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత్ కు ఎంతో విలువైన ఆటగాడు. విధ్వంసకర బ్యాటింగ్, అద్భుతమైన ఫీల్డింగ్, ఉపయుక్తకరమైన ఆఫ్ స్పిన్ బౌలింగ్ తో టి20, వన్డే ఫార్మాట్లకు అతికినట్టు సరిపోతాడు. అయితే, టెస్టుల్లో ఈ ఉత్తరప్రదేశ్ ఆటగాడి రికార్డు ఏమంత మెరుగ్గా లేదు. 18 టెస్టులాడి 26.48 సగటుతో 768 పరుగులు చేశాడు. దాంతో, అతడికి భారత టెస్టు జట్టులో స్థానం దక్కడంలేదు. ఈ నేపథ్యంలో, వచ్చే దేశవాళీ సీజన్ లో సత్తా చాటి టెస్టు జట్టు బెర్తు ఖరారు చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నాడు రైనా. అందుకేనేమో... భార్య ప్రియాంకతో నెదర్లాండ్స్ విహారానికి వెళ్లినా, కిట్ ను తీసుకెళ్లడం మర్చిపోలేదు. ప్రస్తుతం డచ్ రాజధానిలోని ఆమ్ స్టర్ డామ్ క్రికెట్ క్లబ్ (ఏసీసీ) సింథటిక్ పిచ్ లపై ప్రాక్టీసు షురూ చేశాడు. ఆ దేశపు జాతీయ జట్టు బౌలర్లతో బంతులు వేయించుకుంటూ నెట్స్ లో చెమటోడ్చుతున్నాడు. ఆమ్ స్టర్ డామ్ నుంచి పీటీఐ ప్రతినిధితో ఫోన్ లో మాట్లాడుతూ... "తాజా సీజన్ సమీపిస్తోంది. భారత్ కోసం అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. ఎప్పుడెప్పుడు ఆడతానా అని తహతహగా ఉంది. డచ్ జాతీయ జట్టుతో ప్రాక్టీసు చేయడం ఎంతో బాగుంది. ఆమ్ స్టర్ డామ్ లో క్రికెట్ సౌకర్యాలు ఉపయోగించుకునేందుకు అనుమతించిన డచ్ క్రికెట్ బోర్డుకు, ఆమ్ స్టర్ డామ్ క్రికెట్ క్లబ్ కు, సింథటిక్ పిచ్ లపై నాకు బంతులు విసిరిన డచ్ మీడియం ఫాస్ట్ బౌలర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News