: అక్కడ ప్లాస్టిక్ అమ్మితే లక్ష, వాడితే 200, పారేస్తే వెయ్యి జరిమానా!
ప్లాస్టిక్ వాడకంపై ఎన్నో నిబంధనలు ఉన్నాయి. అయితే అవేవీ అమలు కావడం లేదన్నది బహిరంగ రహస్యం. కానీ తమిళనాడులోని తేని జిల్లాలో మాత్రం అలా కాదు. ప్లాస్టిక్ నిషేధంపై కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. జిల్లా పరిపాలనా యంత్రాంగం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. పొరపాటున ఎవరు ప్లాస్టిక్ వినియోగించినా, అమ్మినా భారీ జరిమానా కట్టాల్సిందే. జిల్లాలోని పంచాయతీ అధికారులను అందులో భాగస్వాములను చేశారు. దుకాణాల్లో ప్లాస్టిక్ అమ్మితే, సంస్థల్లో వినియోగిస్తే లక్ష రూపాయల జరిమానా విధించాలని సూచించారు. అలా కాకుండా ఎవరైనా వ్యక్తిగతంగా వినియోగిస్తే వంద నుంచి రెండు వందల రూపాయల వరకు, బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ సామాన్లు పారేస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధించాలని ఆదేశించారు. ఒకసారి జరిమానా విధించాక మళ్లీ తప్పు చేస్తే జరిమానా పెరుగుతుందని, ప్లాస్టిక్ నిషేధంలో కఠినంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.