: వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డిని వాహనంతో ఢీ కొట్టిన పోలీసులు?
చిత్తూరు జిల్లా చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు తమ వాహనంతో ఢీ కొట్టారా? ఔననే అంటున్నారు వైకాపా నేతలు. నగరిలో ఎమ్మెల్యే రోజా చేపట్టిన ధర్నాకు మద్దతుగా తమ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తుండగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారని... ఇదే క్రమంలో, పల్లిపట్లు గ్రామం వద్ద చెవిరెడ్డిని పోలీసులు నిలువరించారని వైకాపా నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో, చెవిరెడ్డిని పోలీసులు తమ వాహనంతో ఢీ కొట్టారని... ఈ ఘటనలో చెవిరెడ్డి గాయపడ్డారని చెప్పారు. గాయపడ్డ చెవిరెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి తిరుపతి పోలీసులకు చెవిరెడ్డి ఫిర్యాదు చేశారని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.