: ప్రపంచం ముందున్న అతిపెద్ద రిస్క్ చైనా మాంద్యం
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్టాక్ మార్కెట్ ఈక్విటీలకు వస్తున్న పెట్టుబడులు 2001 తరువాత కనిష్ఠ స్థాయికి దిగజారాయి. ఫండ్ మేనేజర్లు ఎవరూ కూడా పెట్టుబడులకు స్టాక్స్ ఉత్తమ ఆప్షన్ గా చెప్పడం లేదు. తాజాగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెర్రిల్ లించ్ జరిపిన సర్వే సైతం ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. జీఈఎం (గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్)లలో యూరప్ మార్కెట్లు యూరప్ మార్కెట్లలో 48 శాతం వరకూ ఇబ్బందుల్లో ఉన్నాయని సర్వేలో భాగం పంచుకున్న ఫండ్ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. జూలైతో పోలిస్తే ఆగస్టులో మార్కెట్లు స్థిరత్వాన్ని పొందవచ్చని 61 శాతం మంది అంచనా వేశారు. ఇక ప్రపంచం ముందున్న అతిపెద్ద రిస్క్ చైనాలో నెలకొన్న మాంద్యమేనని 52 శాతం మంది వివరించారు. ఇక గ్రీస్ లో నెలకొన్న అనిశ్చితి వరల్డ్ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపదని ఈ సర్వేలో వెల్లడైంది. గ్రీస్ సంక్షోభం ప్రభావం చూపవచ్చని కేవలం 2 శాతం మాత్రమే అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఒకరు చైనా మాంద్యం లేదా యూరప్ రుణ కష్టాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనున్నాయని వ్యాఖ్యానించారు. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందని 48 శాతం మంది పేర్కొనగా, అది అక్టోబర్ తరువాతే జరగవచ్చని 39 మంది భావిస్తున్నారు. చైనాలో వృద్ధి రేటు తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును హరించి వేస్తోందని సర్వే నిర్వహించిన బీఓఎఫ్ఏ మెర్రిల్ లించ్, చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజిస్ట్ మైఖేల్ హార్ట్ నెట్ వ్యాఖ్యానించారు. ఈనెల 7 నుంచి 13 వరకూ సుమారు 574 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్న 202 ఫండ్ కంపెనీలను ప్రశ్నించి సర్వేను రూపొందించామని ఆయన తెలిపారు.