: ప్రతిపక్షాల విమర్శలను ఏమాత్రం పట్టించుకోను: బాలకృష్ణ
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సచివాలయానికి వచ్చారు. తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఆయన ఏపీ మంత్రులతో భేటీ అవుతున్నారు. కాసేపటి క్రితమే మంత్రి అచ్చెన్నాయుడుతో ఆయన భేటీ ముగిసింది. అనంతరం, బాలకృష్ణ మాట్లాడుతూ, తాను కేవలం హిందూపురానికే పరిమితం కాదని... మొత్తం అనంతపురం జిల్లాను అభివృద్ధిపథంలో తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు. హిందూపురంలో నీటి సమస్య ఉందని... ఈ ఏడాది చివరికల్లా హిందూపురానికి పుష్కలంగా నీళ్లు వస్తాయని తెలిపారు. అంతేకాకుండా సాంస్కృతిక, పర్యాటక, క్రీడల పరంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామని చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలు సాధారణమే అని... అలాంటి వాటిని తాను ఏమాత్రం పట్టించుకోనని స్పష్టం చేశారు.