: ఆంధ్రా డీఐజీని అవమానించిన తెలంగాణ సీఎస్... ఏపీ డీజీపీ రాముడికి అందిన ఫిర్యాదు
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ వాదులు, సీమాంధ్రుల మధ్య మాటల యుద్ధం భీకర స్థాయిలోనే జరిగింది. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలుగా పదవీ బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుల మధ్య కూడా మాటల తూటాలు పేలాయి. తాజాగా రెండు రాష్ట్రాలకు చెందిన అధికారుల మధ్య వార్ మొదలైంది. అది కూడా ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారుల మధ్య ఈ వివాదం తలెత్తడం విశేషం. వివరాల్లోకెళితే... రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోని కొన్ని సంస్థలను కేంద్రం ఆర్టికల్ 10 కింద చేర్చింది. ఈ తరహా సంస్థల విభజన క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చ కోసం ఇటీవల జరిగిన ఓ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడెమీ (అప్పా) తరఫున ఆ సంస్థలో అడిషనల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వెంకటేశ్వరరావు (డీఐజీ కేడర్) హాజరయ్యారు. విభజన నేపథ్యంలో ఆయన ఏపీ కేడర్ అధికారిగా మారారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వెంకటేశ్వరరావు స్థానంలో తెలంగాణ సర్కారు పరిమళ నూతన్ అనే అధికారిని నియమించింది. అయితే అప్పాలో పదేళ్ల పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులకు శిక్షణ ఇచ్చే వెసులుబాటు ఉంది. ఈ కారణంగానే అక్కడి విధుల నుంచి రిలీవ్ కావాలన్న తెలంగాణ సర్కారు ఆదేశాలను వెంకటేశ్వరరావు పాటించలేదు. పరిమళ నూతన్ కు చార్జ్ ఇవ్వలేదు. ఆర్టికల్ 10 సంస్థలకు సంబంధించి జరిగిన సమావేశానికి అప్పా తరఫున వెంకటేశ్వరరావు హాజరయ్యారు. సమావేశానికి నేతృత్వం వహించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మ, వెంకటేశ్వరరావుపై అంతెత్తున ఎగిరిపడ్డారట. ‘‘ఏమయ్యా, నీవెందుకు రిలీవ్ కాలేదు? ఆంధ్రావాడివి. నీకిక్కడేం పని?’’ అని అందరి ముందే నిలదీశారట. దీంతో మనసు నొచ్చుకున్న వెంకటేశ్వరరావు నేరుగా ఏపీ డీజీపీ జేవీ రాముడికి ఫిర్యాదు చేశారు. సాంతం విన్న ఏపీ డీజీపీ, దీనిపై సవివరంగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారు. డీజీపీ ఆదేశాలతో వెంకటేశ్వరరావు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తూ ఫిర్యాదు చేశారు. డీజీపీ జేవీ రాముడు సూచనతో ఆయన గవర్నర్, ఏపీ సీఎస్ లకు కూడా ఫిర్యాదు చేశారు.