: ప్రారంభోత్సవాల్లో పోటీ పడుతున్న మోదీ, నితీశ్!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లు ఒకరికొకరు పోటీపడుతున్నారు. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందుగానే ఓటర్లను ఆకర్షించేందుకు తమవంతుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇప్పటివరకు బీహార్ లో మోదీ 17 ప్రారంభోత్సవాలు చేస్తే, నితీశ్ 13 ప్రారంభోత్సవాలు చేశారట. ఇక నిన్న (మంగళవారం) ఒక్క రోజే మోదీ ఏకంగా 11 జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం విశేషం. అవి కాకుండా బీహార్ లోని ఆరాలో ముజాఫర్ పూర్-సోన్ బనర్ బర్సా రెండు లేన్ల రహదారిని కూడా ప్రారంభించడం గమనార్హం. 'తానేం తక్కువా!' అంటూ జులై 21న పాట్నాలో రూ.300 కోట్లతో నిర్మించిన తొలి ఫ్లైఓవర్ ను నితీశ్ ప్రారంభించారు. ఈ నెల 7న రూ.500 కోట్లతో ఓ మ్యూజియంలో నిర్మించిన రెండు గ్యాలరీలకు కూడా ప్రారంభోత్సవం చేశారు. అవి కాకుండా నియోజన్ భవన్ ప్రాజెక్ట్, ఐదు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా నితీశ్ ప్రారంభించారు. బీహార్ లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా సాధ్యమైనన్ని కార్యక్రమాలు చేపట్టి అధికారం చేజిక్కించుకోవాలన్నది ఈ ఇద్దరి నేతల ప్రధానోద్దేశం అని చెప్పనక్కర్లేదు.