: ‘వేధింపు’ల విద్యార్థిని చదివిస్తున్న బాబూరావు... రిషితేశ్వరి తండ్రి ఆరోపణ
ఆచార్య నాగార్జున వర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. రిషితేశ్వరిపై వేధింపులకు శ్రీకారం చుట్టిన శ్రీనివాస్ అనే విద్యార్థిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కళాశాల ప్రిన్సిపల్ బాబూరావే చదివిస్తున్నారట. ఈ మేరకు రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ సంచలన వ్యాఖ్య చేశారు. బాబూరావు అండదండలతోనే శ్రీనివాస్ విద్యార్థినులపై యథేచ్ఛగా వేధింపులకు దిగుతున్నాడని ఆయన ఆరోపించారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న గదిలో లభించిన ఆమె డైరీలోని సీనియర్ల పేర్లు కొట్టివేసిన ఘటనలోనూ బాబూరావు హస్తముందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే రిషితేశ్వరి ఇంటివద్ద రాసిన రెండో డైరీని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటు విచారణ కమిటీ, పోలీసు అధికారులకు కూడా అందించానని ఆయన పేర్కొన్నారు. తన కూతురు ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు.