: బీజేపీకి నాగం గుడ్ బై?... ‘బచావో తెలంగాణ’ పేరిట ప్రజా వేదిక ఏర్పాటు
ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ మంత్రిగానే కాక టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన నాగం జనార్దన్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత క్రమంగా ప్రాభవం కోల్పోయారు. టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆయన కొంత కాలం పాటు సైలెంట్ గానే ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. అయితే బీజేపీలోనూ ఆయన పొసగలేకపోయారు. బీజేపీలో ఉంటూనే సాగు నీటి ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో ‘బచావో తెలంగాణ’ పేరిట నాగం తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. అయితే ఈ యాత్రలే నాగంను బీజేపీకి దూరం చేశాయి. ప్రస్తుతం నాగంతో పాటు ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని కూడా ఈ యాత్రలు పార్టీకి దూరం చేశాయనే చెప్పాలి. ప్రస్తుతం వీరిద్దరికీ పార్టీలో అంతగా గుర్తింపు ఇవ్వడం లేదు. దీంతో భగ్గుమన్న ఈ ఇద్దరు నేతలు ‘బచావో తెలంగాణ’నే ప్రజా వేదికగా మార్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీకి కటీఫ్ చెబుతున్నట్లు బహిరంగంగా ప్రకటించకున్నా, ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వీరిద్దరూ నేడు హైదరాబాదులోని బషీర్ బాగ్ లో కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.